LSG vs MI: ఉత్కంఠ పోరులో లక్నో ఘన విజయం... పోరాడి ఓడిన ముంబై.! 5 d ago

IPL 2025 లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. లక్నోలోని ఏకనా స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) ముంబై ఇండియన్స్ (MI) పై 12 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రిషభ్ పంత్ వరుసగా నాలుగవ సారికూడా విఫలమైన.. మిగతా బ్యాటర్లు రాణించడంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసింది.
చివరి ఓవర్ వరకు ముంబై పోరాడిన లాభం లేకుండా పోయింది. ఆడిన నాలుగు మ్యాచ్లలో ముంబై మూడు ఓటములు నమోదు చేసింది. 4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి 1 కీలకమైన వికెట్ తీసుకుని మాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. బరిలోకి దిగిన లక్నో ఓపెనర్లు అద్భుతంగా ప్రారంభించారు. ఓపెనర్ మిచెల్ మార్ష్ (60) ఓపెనింగ్ నుంచే వీర బాదుడు బాదాడు.. టీమ్ స్కోర్ 69 ఉన్నప్పుడే.. మార్ష్ ఒక్కడి స్కోరే 50 రన్స్ ఉంది. అంత భయంకరమైన బ్యాటింగ్ ఆడాడు. ఫార్మ్ లో లేని ఎయిడెన్ మార్‌క్రమ్ (53) హాఫ్-సెంచరీతో ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఆ తరువాత వచ్చిన పూరన్ (12).. రిషభ్ పంత్ (2) తక్కువ పరుగులకే వెనుతిరిగారు. IPL టోర్నీలోనే హైయెస్ట్ పెయిడ్ ప్లేయర్ గా నిలిచిన రిషభ్ పంత్ ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ ప్రదర్శన చెయ్యలేదు…. మరోసారి సింగిల్ డిజిట్ స్కోరుకే పెవిలియన్ చేరాడు. ఇక చివర్లో ఆయుశ్ బదోనీ (30), డేవిడ్ మిల్లర్ (27) రాణించడంతో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 రన్స్ స్కోరు చేసింది. ఒక దశలో భారీ స్కోర్ వెళ్తుందనుకున్న సమయంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా అద్భుతంగా బౌలింగ్ వేసాడు. వేసిన 4 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అద్భుతంగా రాణించాడు.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో.. విల్ జాక్స్ (5) ఔట్ అయ్యాడు. ఆవెంటనే ర్యాన్ రికెల్టన్ (10) కూడా పెవిలియన్ చేరాడు. ఇక మ్యాచ్ కష్టమే అనుకున్న సమయంలో నమన్ ధీర్, సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 69 భాగస్వామ్యాన్ని నెలకొలిపి.. ముంబైను గట్టెక్కించారు. నమన్ ధీర్ (24 బంతుల్లో 46 రన్స్).. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67 రన్స్) రాణించడంతో ముంబై లక్ష్యం దిశగా సాగింది.
ఆ తరువాత వచ్చిన తిలక్ వర్మ (25).. హార్దిక్ పాండ్య (28*) ఆడినప్పటికీ ముంబైని ఓటమి నుండి కాపాడలేక పోయారు. చివరి ఓవర్‌లో ముంబై గెలుపుకి 22 పరుగులు కావాల్సి ఉండగా ఫస్ట్ బాల్ కే హార్దిక్ పాండ్య సిక్స్ కొట్టడంతో ఇక ముంబైదే మ్యాచ్ అనుకున్నారు. కానీ అవీష్ ఖాన్ బాగా బౌలింగ్ వేసి.. లక్నోకి విజయాన్ని ఖరారు చేసాడు. దీంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి.. కేవలం 191 పరుగులే చేయగలిగింది. దీంతో లక్నో 12 పరుగుల తేడాతో ముంబైపై ఘన విజయం సాధించింది.
ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అటు బౌలింగ్ లో 5 వికెట్లు.. ఇటు బ్యాటింగ్ లో కీలకమైన 28 పరుగులు చేశాడు. అద్భుతమైన ప్రదర్శన కనపరిచినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
టోర్నీలో భాగంగా ఈ రోజు మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మరియు ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభంకానుంది.